నిదురపోనివ్వండి చరిత్రను
మనం చరిత్రను త్రవ్వుకొవాలా?
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపాలా?
మరీ అంత ప్రేమగా
నెలల పాపాయిని చేతుల్లోకి తీసుకున్నట్లు
అతి పలుచని అద్దాన్ని
జాగ్రత్తగా గోడకు తగిలించినట్లు
మనల్ని మనం చేతుల్లోకి తీసుకోవడం
మనల్ని మనం అద్దంలో చూసుకోవడ౦
అంత అవసరమంటారా?
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళకు
పొరలు పొరలుగా గడ్డకట్టిన రుధిరానికి
విలువ లేనప్పుడు
దేనికోసం మనం చరిత్రను త్రవ్వుకొవాలి?
ఎందుకోసం మనం చరిత్రను కప్పుకోవాలి?
నదికి ప్రవహించడం అలవాటే
చరిత్రకూ ప్రవహించడం అలవాటే
ఏం నేర్చుకున్నాం మనం ప్రవాహం నుండి?
ఏం నేర్చుకున్నాం మనం చరిత్ర నుండి?
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళు
మన గుండెల్ని తడిచేయ్యలేక పొతే
గడ్డ కట్టిన రుధిరం
సిరా చుక్కలై
అహింసను బోధించక పొతే
మనల్ని మనం
మనుషులుగా మార్చుకునే
ఆయుధాలు కాకపొతే
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపడం ఎందుకు
హాయిగా నిదురపోనివ్వండి చరిత్రను!