క్రికెట్ యుద్ధం
క్రికెట్ ప్రభ౦జన౦ వీచడం మొదలై౦ది
క్రికెట్ నిప్పు కణాలు మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తున్నాయి
క్రికెట్ జ్వాల నాలుకలు చాచి నలు దిక్కులకు వ్యాపిస్తోంది
యుద్ద సన్నాహాలతో తలమునకలుగా ఇరు బలగాలు
యోధులు ఆయుధాల్ని ధరించి కదన ర౦గ౦ వైపు అడుగులేస్తున్నట్లుగా!
కళ్ళలో టి.వి లు పెట్టుకొని కొందరు
టీ.వీ తెర రెటినాయై కొందరు
చెవుల్లో రేడియోలు ఇరికించుకొని కొందరు
కర్ణభేరి బ్రాడ్ కాష్టింగ్ స్టేషనై కొందరు
యుద్ద భూమి గోడలపై నిల్చొని ఇంకొందరు
కొందరు ధృతరాష్ట్రులై తెలుసుకుంటూ
కొందరు స౦జయులై వివరిస్తూ, విపులీకరిస్తూ
వీధుల వెంట క్రికెట్ వైరస్ పరుగులు తీస్తూ
కార్యాలయాల్లో దూరి, కారడవుల్లో దూరి
కాకుల్లా
కేకలతో యుద్దాలు చేస్తూ
ఇక్కడ వికెట్ పడితే
అక్కడ కార్గిల్లో కొన్ని తలలు తెగినంత స౦తోషం
ఇక్కడ బంతి బౌ౦డరీ దాటితే
అక్కడ శత్రు భూమిని ఆక్రమి౦చిన౦త ఆనందం
ఉత్సాహంతో కొందరు
ఊగిపొతూ కొందరు
కన్నీళ్ళతో కొందరు
కౌగిలించుకుంటూ ఇ౦కొ౦దరు
ఏ యుద్ధం
ఏ క్రీడ
ఇంతమందిని కదిలించగలదు?
ఏ పబ్బం
ఏ పండుగ
ఇంత మందికి ఉత్సాహాన్ని కొనిపెట్ట గలదు?
ఏ కాలం
ఏ యుగం
ఇంత సమయాన్ని మి౦గేయగలదు
ఇప్పుడు
విడగొట్టడమో, పడగొట్టడమో
పనిగా పెట్టుకున్న వ్యక్తుల్లో, వ్యవస్థలో
ఓ మైత్రినీ
ఓ మ౦చితనాన్నీ
ఓ మానవత్వాన్నీ
ఓ మానవ కళ్యాణాన్నీ
ప౦చివ్వగలదనుకు౦టె
చేద్దాం
అందరం ఈ క్రికెట్ యుద్ధం
చూద్దాం
అందరం ఈ క్రికెట్ చిత్రం!
ఎవరూ భయపడని
ఎవరూ నష్టపడని
ఎవరూ దు:ఖించని
అ౦దరినీ ఒకటిగా చేసి
ప్రేమను మాత్రం పంచే
ఈ యుద్ధం
మళ్లీ మళ్లీ చేద్దాం !!!