Labels

Friday, April 9, 2010

ఎవరంటే?

ఎవరంటే?

నన్నెవరని అడిగితె
కొన్ని ఉదయ  కాంతుల్ని
కొన్ని హృదయ తంత్రుల్ని
కొన్ని హద్దుల సరిహద్దుల్ని
కొన్ని సంప్రదాయ పూదోటల్ని
వెంట పెట్టుక వచ్చిన వాన్నని!

కొన్ని పచ్చిక మైదానాల్ని 
కొన్ని మబ్బుల గుంపుల్ని 
కొన్ని ఇంద్ర ధనుస్సుల్ని 
కొన్ని తెల్ల పావురాల్ని 
కొంత ప్రేమ పుప్పొడిని 
మూట కట్టుక వచ్చిన వాన్నని !

కొన్ని సెలయేళ్ళను 
పరుగెత్తే లేళ్ళను 
కొన్ని మయూరాలను
పాడే కోకిల క౦ఠాలను 
స్ప౦ది౦చే  చిన్ని గుండెను
తట్టి లేపిన వాన్నని!

కొన్ని దర్బ పుల్లల్ని 
కొన్ని అరటి బోదెల్ని
కొన్ని కొబ్బరి మట్టల్ని 
కొన్ని మామిడి ఆకుల్ని 
చేమర్చగలిగే  రెండు కళ్ళని  
మోసుకొచ్చిన వాన్నని
వాళ్లకు చెప్పాను!

అయితే నీ కిక్కడే౦పని అన్నారు
నిర్లక్ష్యంగా!?

అప్పుడు
కొన్ని చురకత్తుల్ని
కొన్ని ఎ.కే ౪౭ లను
కొంత ఆర్.డి. ఎక్స్ ను
కొన్ని అణు బాంబుల్ని
వాళ్లకు చూపి౦చాను
ఒంగి దండం పెట్టారు!!

Wednesday, April 7, 2010

ఎడారి పూవు

ఎడారి పూవు

ఎన్ని కలాముల మెదల్లలో౦చి
రాలి పడ్డ న్యూరానుల కలయికయో
ఈ హైందవ భూమిలో జనించిన 
అణు విత్తనం!
మండుటెండల్లో
ఇసుక తుఫానుల సాక్షిగా
ప్రొక్రాన్ ఎడారిలో
పుష్పించగా
వెదజల్లిన పరిమళాలు
ఈ జాతి స్వరాల్లో
ఆనందాన్నీఆత్మస్థైర్యాన్ని నింపగా
పరజాతి నరాల్లో
అలజడిని అసూయను సృష్టిస్తుందని
ఈ శాంతి కపోతాల కే౦తెలుసు?
ప్రపంచమా
అహంకారంతో నల్లబారిన రెటీనాను  దాటి
మీ మమతలపై కప్పుకున్న
ఛా౦దసపు ముసుగులను తొలగి౦చి
రేపటి ఉషోదయంలోంచి
ఒక్కసారి ఇటు చూడు
అప్పుడు తెలుస్తుంది

ఇక్కడ ధరించే ఆయుధం
ఆత్మరక్షణ కేనని

ఇక్కడ పఠించే మంత్రం
ధర్మరక్షణ కేనని

ఇక్కడ భరించే సహనం
హిమాలయమంతని

ఇక్కడ ఆశించే జీవన౦
వసుధైక కుటు౦భ౦  కోసమేనని!