ఉనికి
ఆకాశం
ఉరుములతో
మెరుపులతో
నక్షత్రాల వెలుగులతో
నీలి మబ్బుల పరుగులతో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!
నీరు
శ్రావణ మేఘంలోంచి
జారిపడే చినుకుల్లో
హేమంతపు ఉషోదయంలో
గడ్డి పరకలపై నాట్యమాడుతున్న
మంచు బిందువుల్లో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!
గాలి
గ్రిష్మంలో
ఆకుల చిరు కదలికల్లో
తటాకంలో తరంగమై
తుఫాను హోరులో
తలవాల్చిన
కొబ్బరి చెట్ల నడుముల్లో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!
తేజస్సు
ఉషోదయపు
వెచ్చదనంలో
మధ్యాహ్నపు
మరుగుజ్జు నీడల్లో
సాయంత్రపు
నీరెండలో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!
భూమి
పచ్చదనంతో
ఇచ్చు తనంతో
ఆకలి తీర్చే
అమ్మ తనంతో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!
సముద్రపు ఘోషయినా
జలపాతపు హోరయినా
మేఘాల ఘర్జనయినా
మెరుపుల వేలుగులయినా
ఆకుల రెప రెప లైనా
పక్షుల కిల కిల లైనా
సహజమైన తమ ఉనికిని
సహజంగానే ప్రదర్శిస్తాయి!!
మరి!?
ఎందుకీ మనిషి
అసహజమయిన
అజ్ఞ్హానంతో
అహంకారంతో
స్వార్థంతో
సంకుచితత్వంతో
తన ఉనికిని
ప్రదర్శించాలని చూస్తాడు??