విత్తుగా నాటుకోండి
మసక మసకగా వెలుగుతున్న నక్షత్రాల నడుమ
మిల మిలా మెరుస్తున్న
ఆ నక్షత్రాన్ని చూడు
అది మా ఊరు
మా ఊరికి నాగరికత వచ్చింది
కాని
మా పొలంలోని నాగలిని తాకలేక పోయింది
మా ఊరికి తారు రోడ్డు వచ్చింది
కాని
మా పొలం గట్ల మధ్య పరుగెడుతున్న
కాలి బాటను చెరపలేక పోయింది
మా ఊరినిండా విద్యుద్దీపాలు వెలిగాయి
కాని
రాముల వారి గుడిలోని
అఖండ జ్యోతి చిరునవ్వుకు సిగ్గుపడి
ఓ మూల ఒదిగిపోయాయి
మా ఊరికి ఎన్నికలోచ్చాయి
కాని
రాజకీయం
మా ఊరి పొలిమేరను దాటి
మనుషుల మనసుల్లో చొరబడే ధైర్యం చేయలేక పోయింది
కత్తులైనా కటారులైనా
బాంబులైనా బరిసేలైనా
మా ఊరి చుట్టూ కాపలాకాస్తున్న
జొన్న కంకుల్ని చూసి బెదిరిపోతాయి!
ఊరిని పలకరిస్తూ ప్రవహించే పెద్ద వాగు
ఎవరొచ్చినా
ముందుగా కాళ్ళు కడిగి
పవిత్రంగా ఊర్లోకి పంపిస్తుంది!
ఎప్పుడైనా
వర్షా కాలంలో క్షణికావేశ౦తో పొంగినా
ఒక్క పాల కుండతో
శాంతిస్తుంది!
మా వాగు ఇసుక
కాసేపు ఇక్కడే ఆగి
అలసట తీర్చుకొమ్మని ఆపేస్తుంది!
కడుపునిండిన మా ఊరి చెరువు
అలల నవ్వుల్నీ ప్రవహిస్తుంది
వయ్యారంగా ఊగుతున్న వరి కంకులు
ప్రవాహానికి శృతి కలుపుతాయి!
మా ఊరి సత్రం దగ్గరి రావి చెట్టు
దాన్ని ఆప్యాయంగా పెనవేసుకున్న వేప చెట్టు
వృద్ద దంపతుల్లా
పశు పక్షాదులకే కాదు
బాటసారులకూ ఆశ్రయమిచ్చి
మరో సత్రాన్ని నిర్మిస్తాయి!
మా ఊరి ఆడపడచులు
తెల్లవారక ముందే
కవ్వమై
మజ్జిగలో వెన్న ముద్దై తేలుతుంటారు!
మా ఊరి ఆలమందల అరుపులకు
చీకటి పారిపోతూ వుంటే
మైదానాలు ఆకుపచ్చ గీతాలను ఆలపిస్తాయి!
మా ఊరి రైతన్నల చేతుల్లోని
చేర్నాకోలా ఝలుపులకు
ఉలికిపడి నిద్రలేచిన సూర్యుడు
అప్పుడే రాజుకు౦టున్న కమ్మరి కొలిమిలా
ఉలికిపడి నిద్రలేచిన సూర్యుడు
అప్పుడే రాజుకు౦టున్న కమ్మరి కొలిమిలా
తూరుపు కొండ నెక్కి తొంగి చూస్తాడు!
నేతన్నలతో పోటీ పడే సీతాకోకచిలకల్లా
మా ఊరి ఆడపిల్లల అడుగుల సవ్వడికి
నేతన్నలతో పోటీ పడే సీతాకోకచిలకల్లా
మా ఊరి ఆడపిల్లల అడుగుల సవ్వడికి
తోటలోని మొగ్గలన్ని సిగ్గువదలి
పువ్వులై నవ్వుతుంటాయి!
మా ఊరి బడిలో గంట
"తల్లీ నిన్ను దలంచి " అంటూ మొదలై
"విశ్వదాభిరామ" అంటూ ఆగిపోతుంది!
వసారాలో వ్రేలాడదీసిన కంకుల చుట్టూ పిట్టలు
వింత వింత రాగాలతో
మా పిల్లల్ని లాలిస్తుంటాయి!
నిప్పు కణికలా మ౦డుతున్న
మధ్యాహ్నపు ఎ౦డలో
చాకలి మ౦గమ్మ బాదిన దెబ్బలకు
ఒళ్ళు హునమైనా
ఎగురుతున్న కొ౦గల్లా
చెట్ల కొమ్మల్ని పట్టుకొని వ్రేలాడుతూ
తాళ తళా మెరుస్తున్న బట్టల్ని చూసి
ఈ మనుషుల మురికిని కొ౦తైనా వదిల్చామని
ఆన౦ద౦తో సేదతిరుతున్నాయి
చాకిరేవులోని చాకలి బ౦డలు!
నిప్పు కణికలా మ౦డుతున్న
మధ్యాహ్నపు ఎ౦డలో
చాకలి మ౦గమ్మ బాదిన దెబ్బలకు
ఒళ్ళు హునమైనా
ఎగురుతున్న కొ౦గల్లా
చెట్ల కొమ్మల్ని పట్టుకొని వ్రేలాడుతూ
తాళ తళా మెరుస్తున్న బట్టల్ని చూసి
ఈ మనుషుల మురికిని కొ౦తైనా వదిల్చామని
ఆన౦ద౦తో సేదతిరుతున్నాయి
చాకిరేవులోని చాకలి బ౦డలు!
సాయంత్రం
రచ్చబండపై ఊరి పెద్దలు
ధర్మో రక్షతి రక్షిత: అంటూ
భావి పౌరులకు బోధిస్తుంటారు!
తన రథ చక్రాలపై కూసి౦త అనుమానమేమో
పడమటి స౦ద్ర౦లో దూకే౦దుకు వెళ్తున్న సూర్యుడు
కుమ్మరి సారెను తనవె౦ట తీసుకెళతాడు
మళ్లీ రేపటి ఉదయంలో తిరిగిస్తానని!
తన రథ చక్రాలపై కూసి౦త అనుమానమేమో
పడమటి స౦ద్ర౦లో దూకే౦దుకు వెళ్తున్న సూర్యుడు
కుమ్మరి సారెను తనవె౦ట తీసుకెళతాడు
మళ్లీ రేపటి ఉదయంలో తిరిగిస్తానని!
చీకటి పడ్డ తరువాత
వెండి గిన్నెలోని
పాల బువ్వను తినిపోమ్మని
చందమామను పిలుస్తూ
మా తల్లులు పిల్లల్ని బెదిరిస్తుంటారు!
మా వూరి కొత్త జ౦టలు
ఎప్పుడూ కొత్తే అనుకునే పాత జ౦టలు
మావూరి దర్జీ సాయిబూ కుట్టిన
దోమతెరలోని చీకటికి
ధన్యవాదాలు అర్పిస్తు౦టాయి
మా ఇల్లకు
మా వూరి కొత్త జ౦టలు
ఎప్పుడూ కొత్తే అనుకునే పాత జ౦టలు
మావూరి దర్జీ సాయిబూ కుట్టిన
దోమతెరలోని చీకటికి
ధన్యవాదాలు అర్పిస్తు౦టాయి
మా ఇల్లకు
తలుపులుంటాయి
కాని
తాళాలుండవు!
ఆరుబైట వెన్నెట్లో మా పడక
మంద్రంగా వీస్తున్నగాలి ఈలే మాకు జోల పాట!
మా ఊర్లో
నవరాత్రులన్ని
హరికథలతో తెల్లవారుతాయి!
దశిమి రోజున
సీతారామ కళ్యాణంతో
కథ కంచికి చేరుతుంది!
అప్పుడు ఊరంతా జమ్మి చెట్టు కింద వాలుతుంది
పెద్దలకిచ్చిన జమ్మిపత్రం
స్వర్ణాక్షితలై
మా తలలపై నుండి జారుతుంటాయి!
పీర్ల పండగ రోజు
మా ఊరు
గుండం చుట్టూ గజ్జ కట్టి నాట్యం చేస్తుంది!
అట్లతద్దికి
మా ఊరి కన్నెపిల్లలు
ఉయ్యాలలై ఉగుతుంటారు!
తోలు బొమ్మలాటలోని బంగారక్కా
ఆవిడ చుట్టే తిరుగుతున్నజుట్టుపోలిగాడు
నిత్యం మా పెదవులపై నర్తించే చిరునవ్వే
రాత్రి బుర్ర కథలోని
తా౦డ్ర పాపారాయుడి పౌరుషం
మరునాటి సాయ౦కాల౦
కర్రలతో కత్తి యుద్ధం చేయిస్తుంది
తా౦డ్ర పాపారాయుడి పౌరుషం
మరునాటి సాయ౦కాల౦
కర్రలతో కత్తి యుద్ధం చేయిస్తుంది
దశరా వేషాల్లోని శూర్పనఖ రూపం
మమ్మల్ని ఇప్పటికి వె౦టాడుతూనే వుంది
ఊరి బొడ్రాయి
దుష్ట శక్తులకు
లక్ష్మణ రేఖ గీస్తు౦ది
పోలిమేరలోని ఎల్లమ్మ
తన చల్లని చూపులతో
ఊరిని కాపాడుతుంటుంది
మా ఊరి గుడిలో ధూప౦
మోగుతున్న గుడి గంట
ఇదే స్వర్గానికి దార౦టూ
గుర్తుచేస్తుంటుంది!
మా ఊర్లో
కులాలున్నాయి
కుల వృత్తులూ ఉన్నాయి
కాని
వరసలు కలుపని
పిలుపే వుండదు
అందరూ కలువని
పండుగే వుండదు!
మసక మసకగా వెలుగుతున్న
నక్షత్రాల్లారా
రండి మా ఊరికి
మా ఊరిని తీసుకెళ్ళి
మీ ఊర్లో నాటుకోండి!!