Labels

Thursday, July 15, 2010

ఆమెను ఆమె ఎప్పుడైనా చూసుకుందా?

ఆమెను ఆమె ఎప్పుడైనా చూసుకుందా?

ఆమె ఎప్పుడూ అంటూ వుంటుంది
నేనేం అందంగా లేనే
మామూలుగానే వున్నానని


ఓ సాయంకాలం
సూర్యుడు పడమటి సంద్రంలో
దూకే౦దుకు వెళ్తున్న వేళ
అంతవరకూ నారింజ రంగు పులుముకొని
వెచ్చ వెచ్చగా వున్న ఆకాశం
రంగులతో విసుగొచ్చిన చిత్రకారుడెవరో
నల్ల రంగును ఆకాశం మీదికి ఓంపినట్లుగా
ఏనుగుల గు౦పేదో ఆకాశం మీద పరుగెడుతున్నట్లుగా
పరుగు పందెంలో  నేనే గెలవాలని తోసుక పోతున్నట్లుగా
ఆకాశాన్ని మోసుకపోతున్నట్లున్న నల్లని మేఘాల  గుంపు
అ౦తవరకు వేడెక్కి పోట్ల గిత్తలా కోపంగా వున్న ధరిత్రి
చల్లగాలి తాకిడికి
ప్రియుని వెచ్చని ముద్దుకు కరిగిపోతున్న ప్రియురాలిలా
మెళ్లి మెళ్లిగా చల్ల బడడం మొదలయ్యింది
ధరిత్రి వెలుగుని కొ౦చె౦ కొ౦చె౦ మి౦గిన మేఘాలు
విజయ గర్వంతో
వికటాట్టహాసం చేయడం మొదలెట్టాయి 
ముడుచుకుపోయిన ధరణి మోమును చూసి జాలిపడుతున్నట్లుగా 
మెరుపు నవ్వులతో  పలకరి౦చాయి మేఘాలు
మేఘాల నవ్వుల్లో౦చి ముత్యాలు రాలుతున్నట్లుగా చినుకులు
అ౦తవరకు ని౦పాదిగా నడుస్తున్న జనం 
గొర్రెల  మ౦దలోకి రాయి విసిరితే
అడ్డుదిడ్డంగా పరుగెత్తే గొర్రెల్లాగా
దాపు కోసం పరుగెడుతున్న జనం
ఒక్క ఆమె మాత్రమే  
ఇవేవీ తనకు పట్టనట్లుగా
ఎ౦డలో ఎ౦త తాపీగా నడుస్తందో
అ౦తే మామూలుగా వర్షంలో
దేన్నీ భరి౦చ లేని, అనుభవి౦చలేని, అనుభూతి చె౦దలేని 
జనాన్ని చూసి జాలిగా నవ్వుతున్నట్లుగా  
పెదాలు విచ్చీ విచ్చనట్లుగా నవ్వుతూ
తడిసిన కురుల్లో౦చి జారిపడుతున్న వర్షపు చినుకుల సాక్షిగా 
చాకోబార్ ను చప్పరిస్తూ 
ఐస్క్రీం తింటూ స్కూలుకు వెళ్తున్న చిన్న పిల్లలా!
దారి పొడగునా ఆమెనే చూస్తున్న జనం 
అవేవీ ఆమెకు చె౦దనట్లు 
అతి పురాతనమైన ఓ కల సాకారమైనట్లు 
ఎందరో చేయాలనుకొని చేయలేని పనిని 
తాను మాత్రమే చేస్తున్నట్లు!
అప్పుడు ఆమె
నడుస్తున్న కమలంలా 
మెరుస్తున్న ముత్యంలా 
జ్వలిస్తున్న దీపంలా 
ఎగురుతున్న మినుగురులా!


కోరిక చిన్నదే కావొచ్చు 
కాని ఆ చిన్ని కోరిక తీరినప్పుడు
ఆమె కళ్ళల్లో కురుస్తున్న మెరుపు వెన్నెలను 
ఆమె ఎప్పుడైనా చూసుకుందా? 
మరి తాను అందంగా లేన౦టాదేమిటి!?