Labels

Thursday, May 13, 2010

ఎక్కడనుండి వచ్చావో?

ఎక్కడనుండి వచ్చావో?

ఏ నక్షత్ర కిరణ కోసలపై ఎగురుతూ వచ్చి
నా కంటి పాపలో గూడు కట్టుకున్నావో

ఏ శిఖరాగ్ర సీమలను తడుముకుంటూ వచ్చి
నా లేత అరచేతులలో ఒదిగిపోయావో

ఏ జలపాతాల నురగలపై తేలియాడుతూ వచ్చి
నా ఒడిలో నిశ్శబ్ద సంగీతాన్ని వినిపిస్తున్నావో

దట్టంగా అల్లుకున్న ఏ అడవి తీగల ఒ౦పుల్ని మోసుకొచ్చి
నా నడుము చుట్టూ ఓ తియ్యని అనుబ౦ధమై అల్లుకున్నావో

నే నిప్పుడు
నీ పెదాల నుండి పాదాలదాకా
ప్రవహిస్తున్నాను!

ఇప్పుడు
నీ పెదాలను ముద్దాడ్డం
నా కిష్టమైతే
నీ పాదాలపై మోకరిళ్లడం
మరీ మరీ ఇష్టం!!

నేను - వాడు

నేను - వాడు

పద్యం మత్తులో నేను
మద్యం మత్తులో వాడు
నన్ను నేను పద్యీకరి౦చుకు౦టున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

పదం మత్తులో నేను
మదం మత్తులో వాడు
పదంతో ప్రప౦చాన్ని పలకరిస్తున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

కలం కౌగిలిలో నేను
కాంత కౌగిలిలో వాడు
కలంతో కాలజ్ఞానాన్ని లిఖిస్తున్నాను
వాడేం చేస్తున్నాడో తెలియదు

అనుభూతిలో నేను
భౌతికానందంలో వాడు
నేను వాడిలా బ్రతకలేను
వాడు నాలా మారనూ లేడు
వాడు వాడే
నేను నేనే
పక్క పక్కనే పయనిస్తున్నా
కలవని రైలు పట్టాలం
అయినా మే మిద్దరం
అవనికి చుట్టాలం !