ఆమె - వసంతం
ఆమె
వస్తూ వస్తూ
నా కోసం
వసంతాన్ని వెంట తెచ్చేది
పూదోటనో
పుప్పొడి పరిమళాన్నో
కానుకగా యిచ్చేది
కొంగు ముడి విప్పి
కోకిల రాగాల్ని వెదజల్లేది
మూసిన పిడికిలి తెరచి
వెన్నెల్ని చిలకరించేది
అప్పుడు
ఆమె అధరాలపై పూసిన చిరు నవ్వు
నా చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రాన్ని నిర్మించేది
మాటల్ని పోగొట్టుకున్న నేను
చూపుల్తో సంభాషించే వాడిని
వెళ్తూ వెళ్తూ
గజ్జల శబ్దాన్ని జారవిడిచేది
ఆమె వదలి వెళ్ళిన శ్వాశ లోంచి
మరిన్ని వసంతాల్ని వెదుక్కునే వాడిని