Labels

Monday, April 12, 2010

ప్రభ కోల్పోయిన సూర్యుడు

ప్రభ కోల్పోయిన సూర్యుడు

ఇలా జరుగుతుందని
నే నెప్పుడైనా  కలగన్నానా?
సందు మలుపులో చూపుల్తో కలుసుకున్న మే మిద్దరం
మరో సంధ్య వేళలో
మాటల్తో పెనవేసుకుంటామని
దారీ గమ్యం లేని రెండు భిన్న దృవాలు
మూడు ముళ్ళతో ముక్కోటి ఆశలతో మురిపెంగా
ఒకే దారిలో కలిసి పయనిస్తామని అనుకున్నామా?
అప్పుడప్పుడే యవ్వనం తొంగిచూస్తున్నతొలి  దశలో 
నమ్మకంగా నా చేతిలో  చేయి వేసిన ఆమె
ఇప్పుడిప్పుడే యవ్వనం తొలిగిపోతున్న మలి దశలో
సడీ  సప్పుడు చేయకుండా
వీడ్కోలు పలుకుతుందని ఎప్పుడైనా ఊహి౦చానా?
ఏమీ కాని నాకు ఏమీ లేని నాకు ఏంకావాలో తెలియని నాకు 
మాటంతా నాకిచ్చి మౌనమే భాషగా అన్నీ తానై 
ఇంద్ర ధనుస్సునెక్కి వెన్నెల్లో 
ఆకాశ మార్గాన విహరించే వేళ
నక్షత్రమై తాను రోదసిలోకి ఎగిరి పోయి 
శిలాజంలా నన్ను ఈ  మట్టిపై నాటి పోతుందని
దు:ఖం సముద్రంలా విస్తరిస్తూ ఉంటె
చుక్కాని లేని నావను బహుమతిగా ఇచ్చి
చుక్కల్లో తన్ను వెతుక్కొమ్మని దారి కనుక్కొమ్మని
ఈ దాగుడుమూతలాటలో 
ఎవరిని ఎవరు కోల్పోయారో ఎలా కనుక్కోవడం?
ఆమె ఓ మహా సముద్రం 
నదిలా నే నామెను కలసిన ప్రతి క్షణం 
ఆకాశంలో మెరుపుల హరివిల్లులు విరిసేవి 
ఆమె ఉచ్చ్వాశ నిశ్వాసాలే కదా
ఈ వెదురు బొంగులోంచి రాగ ఝరులుగా ప్రవహించింది
అక్కడ ఊపిరి ఆగిపోయింది
ఇక్కడ మురళి మూగబోయింది

ఇంటిలో ఆమె తచ్చాడుతుంటే
నీడలా నా చూపులు ఆమెను వెంటాడేవి
ఆమె లేని చోటంతా నాకిప్పుడు శూన్య౦
శూన్య౦ లోంచి ఆమె నవ్వు వినపడుతోంది
ప్రతి వస్తువులోను ఆమె కనపడుతోంది
ఆమె వున్నప్పుడు నేనామెను సరిగా గమనించానో లేదో
ఇప్పుడు ఆమె కోసం నాలో నేను వెతుక్కు౦టున్నాను
నదికి ఆవలి ఒడ్డున చేయూపుతూ ఆమె
నీళ్లు నిండిన కళ్ళతో చూపు సరిగా ఆనక
నన్ను రమ్మ౦టు౦దో తానే వస్తానంటుందో
గడ్డ కట్టిన మనసుతో ఈవలి ఒడ్డున నేను!!

( మా ఆప్తమిత్రుడు కె.ఆర్. కె. ప్రసాద్ భార్యా వియోగం తరువాత అతని గళం నా కలంలోంచి)