Labels

Monday, February 8, 2010

నే నిక్కడకు వచ్చింది

నే నిక్కడకు వచ్చింది

నే నిక్కడకు వచ్చింది
మొనదేలిన ఈ అనాది ఇసుక రేణువులతో
నా పాదాలను గాయపరచుకునేందుకు కాదు
నా కాళ్ళను నాగళ్ళుగా చేసి
చిగురించడం మరచిపోయిన
ఈ గోధుమ వర్ణపు ఇసుక మేటలకు
మట్టి గంధపు కల్లాపి జల్లి
ధరణి కన్యకు ఆకుపచ్చ చీర బహుకరించేందుకు!

నే నిక్కడకు వచ్చింది
ఈ ఎడారిలో కునికిపాట్లు పడుతున్న
ఒయాసిస్సుల కంటి రెప్పల చాటున
నా దాహార్తిని దాచిపెట్టేందుకు కాదు  
వేలాది వేల ఇసుక పొరల క్రింద
తపస్సమాదిలో ధ్యానిస్తున్న
అనంత అంతర్వాహినీ తరంగాలను
నోరెండిన ఈ సైకత లోయలలో
నయనానందకర ప్రవాహ దృశ్యాలుగా చిత్రి౦చేందుకు
నేనిక్కడకు వచ్చింది
ఖర్జూర హరిత చత్రాల చాయలో
నా స్వేద ద్వారాలను తోసుకొని
ఉబికిన చెమ్మను ఆరబెట్టుకోవడానికో కాదు
ఈ నా అకుంటిత దీక్షా కండరాలలో పొదిగిన
శ్రమ శక్తిని పితికి
ఒయాసిస్సుల నడుమ
సుదూరంగా విస్తరించిన ఇసుక మైదానాలకు
ఫల పుష్ప స్వప్నాలను కానుకగా ఇచ్చేందుకు!

నేనిక్కడకు వచ్చింది
ఈ ఇసుక దిబ్బల గుడారాల నడుమ
నగ్న శిఖరాగ్ర సీమలపై
నా విగ్రహాలను చేక్కేందుకు కాదు
రేపటి తరం మరో తరానికి అందించబోయే
తీయటి జ్జాపకాల మరంద మాలలుగా
ఈ తరం పాదముద్రలను దాచిపెట్టేందుకు!

నేనిక్కడకు వచ్చింది 
జ్యాత్యాహంకారపు విషపు నాగుల
సాలె  గూటిలో చిక్కుకొని 
రహదారి పక్క విసిరేయబడ్డ ఓ అనాధ శవమై 
కన్నవారి చేతుల్లోంచి జారిపడే 
ఓ బూడిద మూటగా  మిగలాలని కాదు
ఇక్కడి మానవతా మొక్కలను 
ఇక్కడి స్నేహ సౌరభాలను మోసుకెళ్ళి
మా పొలాల్లో పండించుకునేందుకు!! 


No comments:

Post a Comment