భ్రమణం
మట్టిలోకి
ఓ నక్షత్రాన్ని విసిరితే
లక్ష హరిత నక్షత్రాలై
నీ ముందు మోకరిల్లుతాయి!
ఓ గుప్పెడు నీళ్ళను
ఆకాశంలోకి చల్లితే
నీ కోసం ఆ నిలాకాసం
ఓ మంచి నీటి జలతారు సముద్రాన్ని
కానుకగా పంపిస్తుంది!!
దేహాన్ని చీలుస్తున్న ద్వేషాన్ని
నీ పెరటి మొక్కగా పెంచితే
అది మహా వృక్షమై
నీ భవంతిలోకి
పగుళ్ళను పిడుగులుగా వర్షిస్తుంది!!!
నీ అధరాలపై
చిరునవ్వును
నీ హృదయంపై కాస్త ప్రేమను పూయిస్తే
ఈ ప్రపంచం
నిను తన కౌగిట్లో కాపాడుతుంది
ఇవ్వడమనే తపస్సులోనే
వ్యక్తిత్వం తన రూపాన్ని సరిచేసుకుంటుంది
ఇచ్చి పుచ్చుకునే తత్వంతోనే
ఈ జగత్తు
ఓ భ్రమణం పూర్తిచేస్తుంది!!
No comments:
Post a Comment