Labels

Friday, April 9, 2010

ఎవరంటే?

ఎవరంటే?

నన్నెవరని అడిగితె
కొన్ని ఉదయ  కాంతుల్ని
కొన్ని హృదయ తంత్రుల్ని
కొన్ని హద్దుల సరిహద్దుల్ని
కొన్ని సంప్రదాయ పూదోటల్ని
వెంట పెట్టుక వచ్చిన వాన్నని!

కొన్ని పచ్చిక మైదానాల్ని 
కొన్ని మబ్బుల గుంపుల్ని 
కొన్ని ఇంద్ర ధనుస్సుల్ని 
కొన్ని తెల్ల పావురాల్ని 
కొంత ప్రేమ పుప్పొడిని 
మూట కట్టుక వచ్చిన వాన్నని !

కొన్ని సెలయేళ్ళను 
పరుగెత్తే లేళ్ళను 
కొన్ని మయూరాలను
పాడే కోకిల క౦ఠాలను 
స్ప౦ది౦చే  చిన్ని గుండెను
తట్టి లేపిన వాన్నని!

కొన్ని దర్బ పుల్లల్ని 
కొన్ని అరటి బోదెల్ని
కొన్ని కొబ్బరి మట్టల్ని 
కొన్ని మామిడి ఆకుల్ని 
చేమర్చగలిగే  రెండు కళ్ళని  
మోసుకొచ్చిన వాన్నని
వాళ్లకు చెప్పాను!

అయితే నీ కిక్కడే౦పని అన్నారు
నిర్లక్ష్యంగా!?

అప్పుడు
కొన్ని చురకత్తుల్ని
కొన్ని ఎ.కే ౪౭ లను
కొంత ఆర్.డి. ఎక్స్ ను
కొన్ని అణు బాంబుల్ని
వాళ్లకు చూపి౦చాను
ఒంగి దండం పెట్టారు!!

Wednesday, April 7, 2010

ఎడారి పూవు

ఎడారి పూవు

ఎన్ని కలాముల మెదల్లలో౦చి
రాలి పడ్డ న్యూరానుల కలయికయో
ఈ హైందవ భూమిలో జనించిన 
అణు విత్తనం!
మండుటెండల్లో
ఇసుక తుఫానుల సాక్షిగా
ప్రొక్రాన్ ఎడారిలో
పుష్పించగా
వెదజల్లిన పరిమళాలు
ఈ జాతి స్వరాల్లో
ఆనందాన్నీఆత్మస్థైర్యాన్ని నింపగా
పరజాతి నరాల్లో
అలజడిని అసూయను సృష్టిస్తుందని
ఈ శాంతి కపోతాల కే౦తెలుసు?
ప్రపంచమా
అహంకారంతో నల్లబారిన రెటీనాను  దాటి
మీ మమతలపై కప్పుకున్న
ఛా౦దసపు ముసుగులను తొలగి౦చి
రేపటి ఉషోదయంలోంచి
ఒక్కసారి ఇటు చూడు
అప్పుడు తెలుస్తుంది

ఇక్కడ ధరించే ఆయుధం
ఆత్మరక్షణ కేనని

ఇక్కడ పఠించే మంత్రం
ధర్మరక్షణ కేనని

ఇక్కడ భరించే సహనం
హిమాలయమంతని

ఇక్కడ ఆశించే జీవన౦
వసుధైక కుటు౦భ౦  కోసమేనని!

Tuesday, March 30, 2010

ఆమె - వసంతం

ఆమె - వసంతం

ఆమె
వస్తూ వస్తూ
నా కోసం
వసంతాన్ని వెంట తెచ్చేది
పూదోటనో
పుప్పొడి పరిమళాన్నో
కానుకగా యిచ్చేది
కొంగు ముడి విప్పి
కోకిల రాగాల్ని వెదజల్లేది
మూసిన పిడికిలి తెరచి
వెన్నెల్ని చిలకరించేది
అప్పుడు
ఆమె అధరాలపై పూసిన చిరు నవ్వు
నా చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రాన్ని నిర్మించేది
మాటల్ని పోగొట్టుకున్న నేను
చూపుల్తో సంభాషించే వాడిని
వెళ్తూ వెళ్తూ
గజ్జల శబ్దాన్ని జారవిడిచేది
ఆమె వదలి వెళ్ళిన శ్వాశ లోంచి
మరిన్ని వసంతాల్ని వెదుక్కునే వాడిని

సాద్యంలాగుంది

సాద్యంలాగుంది

అక్షరాలతో మాలను అల్లాలని వుంది
హారంగా నీ మెడలొ వేయాలని వుంది

అణుబాంబులు  చేతపట్టి  నడవాలని వుంది
పావురమై నీ ఒడిలో వాలాలని వుంది

అరుణ బింభమై  నీ ముంగిట మురవాలని వుంది
ఆ పాపిట కుంకుమగా మెరవాలని వుంది

పిడికిటిలో చీకటినే పట్టాలని వుంది
నీ నయనాలకు కాటుకగా పెట్టాలని వుంది

గోరి౦టగ నీ పెరటిన పెరగాలని వుంది
చిరు పాదాలకు పారాణిగ  పూయాలని వుంది

కళ్ళు రెండు దివ్వెలుగా పెట్టాలని వుంది
శశి మోమున హారతిగా పట్టాలని వుంది

అనుక్షణము నీ మోమునె చూడాలని వుంది
మూత పడని కనురెప్పల నే కోరాలని వుంది

యుగ యుగాలు నీతోనే గడపాలని వుంది
వేయి జన్మలెత్తితేనె సాద్యంలాగుంది

Wednesday, March 24, 2010

క్రికెట్ యుద్ధం

క్రికెట్ యుద్ధం

క్రికెట్ ప్రభ౦జన౦ వీచడం మొదలై౦ది
క్రికెట్ నిప్పు కణాలు మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తున్నాయి
క్రికెట్ జ్వాల నాలుకలు చాచి నలు దిక్కులకు వ్యాపిస్తోంది
యుద్ద సన్నాహాలతో తలమునకలుగా ఇరు బలగాలు
యోధులు ఆయుధాల్ని ధరించి కదన ర౦గ౦ వైపు అడుగులేస్తున్నట్లుగా!
కళ్ళలో టి.వి లు పెట్టుకొని కొందరు
టీ.వీ తెర రెటినాయై కొందరు
చెవుల్లో రేడియోలు ఇరికించుకొని కొందరు
కర్ణభేరి బ్రాడ్ కాష్టింగ్ స్టేషనై కొందరు
యుద్ద భూమి గోడలపై నిల్చొని ఇంకొందరు
కొందరు ధృతరాష్ట్రులై తెలుసుకుంటూ
కొందరు స౦జయులై వివరిస్తూ, విపులీకరిస్తూ
వీధుల వెంట  క్రికెట్ వైరస్ పరుగులు తీస్తూ
కార్యాలయాల్లో దూరి, కారడవుల్లో దూరి
కాకుల్లా
కేకలతో యుద్దాలు చేస్తూ
ఇక్కడ వికెట్ పడితే
అక్కడ కార్గిల్లో కొన్ని తలలు తెగినంత స౦తోషం
ఇక్కడ బంతి బౌ౦డరీ  దాటితే
అక్కడ శత్రు భూమిని ఆక్రమి౦చిన౦త ఆనందం
ఉత్సాహంతో కొందరు
ఊగిపొతూ  కొందరు
కన్నీళ్ళతో కొందరు
కౌగిలించుకుంటూ ఇ౦కొ౦దరు
ఏ యుద్ధం
ఏ క్రీడ
ఇంతమందిని కదిలించగలదు?
ఏ పబ్బం
ఏ పండుగ
ఇంత మందికి ఉత్సాహాన్ని కొనిపెట్ట గలదు?
ఏ కాలం
ఏ యుగం
ఇంత సమయాన్ని మి౦గేయగలదు
ఇప్పుడు
విడగొట్టడమో, పడగొట్టడమో
పనిగా పెట్టుకున్న వ్యక్తుల్లో, వ్యవస్థలో 
ఓ మైత్రినీ 
ఓ మ౦చితనాన్నీ 
ఓ మానవత్వాన్నీ 
ఓ మానవ కళ్యాణాన్నీ
ప౦చివ్వగలదనుకు౦టె
చేద్దాం
అందరం ఈ క్రికెట్ యుద్ధం
చూద్దాం
అందరం ఈ క్రికెట్ చిత్రం!
ఎవరూ భయపడని 
ఎవరూ నష్టపడని 
ఎవరూ దు:ఖించని
అ౦దరినీ  ఒకటిగా చేసి
ప్రేమను మాత్రం పంచే
ఈ యుద్ధం
మళ్లీ మళ్లీ  చేద్దాం !!!

నీళ్లు - కన్నీళ్ళు

నీళ్లు - కన్నీళ్ళు

రాలింది వాన పొడి
తడువలేదు వున్న మడి
ఉండబోదు ఏమాత్రం రాబడి
మిగిలింది కంటిలో తడి

కొన్నారు విత్తనపు గింజలు
రాలాయి పొలములో పింజలు
విస్తుపోయాయి ఇరు సంజెలు
మిగిలాయి దిష్టి గుంజలు

పెరుగుతుంది కాగిత౦పై వడ్డీ
ఎదుగుతుంది పొలంలో గడ్డి
అమ్ముకున్నారు మిగిలిన దొడ్డి
విరిగింది రైతన్నకు నడ్డి

కుంటింది ముసలి ఎద్దు
విరిగింది నాగలి మొద్దు
లేదు వారి బాధకు హద్దు
చావేనా చివరికి ముద్దు?

తోలిచారు వాళ్ళు రాళ్ళు
మొలవలేదు ఏమాత్రం నీళ్లు
వేసుకున్నారు మెడకు తాళ్ళు
రాలేదు ఎవరికీ కన్నీళ్ళు!!

తప్పెవరిది?

తప్పెవరిది?

ఎం కోరుకుంది తను?
ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ఆసించలేదే
స౦పదలన్నీ తనకు  మాత్రమే చెందాలని కోరుకోలేదే
సమస్త గ్రహాల్ని తన చుట్టూ తిప్పుకోవాలని కలగనలేదే? 
ఆమె కోరిందల్లా 
ఓ గుప్పెడు ప్రేమా 
ఓ నాలుగు కన్నీటి చుక్కలే కదా! 
అది పెద్ద అత్యాశ కాదే 
అసలు ఆశే కాదు కదా
అతని చుట్టూ ఓ ర౦గుల హరివిల్లును నిర్మించుకోవడం
ఆమె చేసిన తప్పా?
అతని చిరునవ్వుల పందిరి క్రింద సేద తీరాలనుకోవడం   
ఆమె చేసిన నేరమా?

దేవుడా
నువ్వెంత చెడ్డవాడివి
మంచి నీటి ప్రవాహాల్ని సముద్రంలో కలిపెస్తావ్
అద్భుత సౌదర్యమైన అడవిని
క్రూర జ౦తువులతో ని౦పేస్తావ్
నీ సృష్టి రహశ్యాల్ని చూడకుండా
సగం కాలాన్ని చీకటిలో దాచేస్తావ్
అసలు
నీలో అంతో ఇంతో చెడ్డ లేకపోతే
చెడ్డవాళ్లనెలా సృష్టిస్తావ్??