Labels

Thursday, March 18, 2010

గిరిక

గిరిక
ఓ ముగ్ధ
ఓ ముద్ద మందారం
ఒక పగలు
ఒక రేయి
ఒంటరిగా
ఎవరూ లేకుండ
వెలుగు కరిగే లోపు
వస్తానన్న తన వాడు
చీకటైనా
రేయి కరిగినా
రాకపోతే?
తోలి కిరణం నుండి 
చిరు చీకటి వరకు 
                                ఆమె మనసు పొందిన 
                                ఎదురు చూపుల అనుభూతి 
                                చీకటి కమ్ముకోస్తున్నప్పుడు 
                                పొందిన 
                                భయం 
                                నడిరేయిలోని 
                                దుఃఖం 
                                చీకటి అంతంలో 
                                ఏమీ చేయలేని తనం
                                ఆమె మనసుకు
                                మానసిక స్థితికి
                                అక్షర రూపమే
                                ఈ నా కవిత
                                           --------------రామానాయుడు

                                   ******

మాయ మరుమం లేని
మంచోడు నా మావ
సీమకైనా సేటు
సేయనీ మొనగాడు

సీమలే దూరనీ
సిట్టడివినున్నా
నా కేటి భయము  
నా మావ తోడు౦టె  

గొడ్డలెట్టీ ఆడు
కొండపై ఎలుతుంటె  
శిరసు ఎత్తిన పరశు
రామయ్య లాగుండు

సుట్టు గుడిసెలు లేవు
సుట్టాలు లేరు
అయినేమి గుబులు
నా మావ నీడు౦టె

పైనుండి దూకేటి
జలపాత మున్నాది
పొద్దున్నె పిలిసేటి
పిట్టలున్నవి సుట్టు

పొద్దెక్కినా గాని
పక్కనే యిడువడు 
నడుముసుట్టూ సేయి
ఉడుములా ఏస్తడు 

అడవి అంతా మనది
ఆకాశమే హద్దు
రాజు ఇక్కడ నేను
నువు రాణి వంటాడు

ఎండ సూడాల౦టె
ఎద పైకి ఎత్తాలి
సెట్టు సందుల గుండ
సూపు ముందుకు పోదు 

సెలయేటి ధారలో
తానమాడుతు వుంటె
గిలిగింత లెడతాడు
జల కనియ వంటాడు 

అడవి కెళ్ళిన మావ
అలసి వచ్చే లోపు
ఎదురుంగ ఎల్లాలి
అలుపంత తీర్చాలి

మొద్దు నెత్తీ ఆడు
ఠీవిగా వస్తుంటె  
కొండ ఎత్తిన సామి
అగుపించు ఆడిలో

అడవి ను౦చీ మావ 
సిలక తెచ్చే లోపు 
సిలకకై కట్టాలి
సిట్టి గూడొకటి

సెట్టు ఎనకాలొదిగి
గుట్టుగా నేనుంటె 
గుబులు గుబులుగ ఆడు
గుట్టలన్నీ తిరుగు

ఎనకెనకగా వచ్చి
గిలిగింత నే పెడితె 
బెదిరి పడి చూస్తాడు
ఎగిరి గంతేస్తాడు

గట్టిగా వాటేసి
ఎదపైన దాచేసి
ఎగిసేటి కన్నీళ్లు
నా నుండి దాస్తాడు

ఎగురుతున్నది మనసు
సిట్టి సిలకను తలసి
సిట్టి సిలకకు తనకు
జట్టెట్ట కుదురునో

అమ్మ అయ్యను ఇడిసి
అడవిలో ఉన్నాము
సిలకొకటి తోడుంటె  
పలుకులే సెప్పొచ్చు  

మనసు బాగోలేక
మాటడకుంటె
ముంగురులె సవరి౦చి
ముద్దెట్టి ఎలతాడు

పాల స౦ద్ర౦ నుంచి
పరిగెట్టు కొచ్చిన
ముద్దుగుమ్మవు అంటు
మురిపాలు చేస్తాడు

ఎదురు బొంగుతొ  ఆడు 
ఈలనే ఆయిస్తే
ఎదలోన నేనపుడు 
కిట్టయ్య అనుకుంట 

ఎలిగేటి ఎన్నెల్లొ 
ఒడిలోన సిరసెట్టి 
రాగాలు తీస్తూ
రాధమ్మ వంటాడు

అయ్య సెప్పిన పిల్ల
ఆడికొద్ద౦టూ
అందరిని ఇడిసేసి
ఎంటేసు కొచ్చాడు

మూడు సె౦ద్రులు పోయె
మొన్నొచ్చి నట్టుంది 
ఎన్ని జనమలనుండొ
ఎరిగినట్టులె వుంది 

గూడె౦లొ ఈడ౦టె
గురి పెద్దగున్న
గుడి పెద్ద మాటకు
గట్టుబడి వచ్చాము

ఇల్లు నెక్కూ పెట్టి
బాణమే ఏస్తుంటె  
సివునిల్లు ఇరిసిన 
రామయ్య అంటారు 

పెద్ద సెప్పిన మనువె
సేసుకోవాలంట
నచ్చినోడితొ మనువు 
ఆచ్చిరాదంట

అప్పుడే వచ్చాము 
అందర్నిమరిసేసి 
అందుకే వాడంటె  
అంత పానము నాకు

సికటయినా ఆడు
గుడిలేకి సేరడు
సీమ సిటుకన్ననూ
నా గుండె లదిరేను

అప్పుడప్పుడు మనసు
ఏడుపే సేసేను
ఇంటిపై మరులొచ్చి
ఎట్టెట్టో అయ్యేను

ఆచారమని సెప్పి
సిట్టడివి కంపారు
నలుసు నెత్తాకనే
తిరిగి ఎల్లాలంట

నలుసు ఎత్తకపోతె  
నారియే కాదంట
కడుపు పండక పోతె
కానలే గతియంట

ఆ అడ్డు తొలగాలి
మా మనువు జరగాలి
అందాక మేమేమో
కొండ పిల్లలమంట

పాములే తిరిగేటి
పాడు దేశం ఇది
పామునే కాటేసే
పాడు మనుషులు ఈళ్లు

పొడవాటి నా జడను
మెడసుట్టు సుట్టేసి
పామల్లె ఉందంటూ
పక పకా నగుతాడు

ఆడి మెడ సుట్టార
నా జడను సూస్తు౦టె
నాగయ్య సుట్టిన
శివుడల్లె అగుపించు

అల్లనల్లన సాగె
నల్లాని మబ్బా
నా మావ ఎదురైతె 
కబురైతే  సెప్పు

తానమాడీ నేను
తలవాల్చి నిలుచు౦టె  
జుట్టులో సెయ్యెట్టి
మబ్బులే అంటాడు

సెట్టు సుట్టూ సెట్టు
పెనయేసుకున్నట్టు
నను సుట్టుకుంటాడు
నా సుట్టె వుంటాడు

ఎగురుతూ ఎలిగేటి
మిణుగురూ అమ్మలూ
ఎలుగులో నా మావ 
ఎదురైతె సెప్పరూ 

సీకటైనా గాని 
ఎలుగె౦దుక౦టాడు 
ఎలిగేటి నా కళ్ళే
ఎలుగు దీపాల౦ట

కాయ కసురూ సాలు
కడుపు ని౦పేక౦టు
పుట్ట తేనియ కూడ
పట్టడూ నాసామి  

పరులు చేసిన కష్టం
తనకెందు కంటాడు
పగవాడి కష్టాన్ని
తను ప౦చుకు౦టాడు

అడవి అంతా తిరిగి
అలసీన గోవమ్మ
అడవిలో నా మావ
అడుగైన చూసావ

ఆదమరచీ మావ
అడుగునే తొక్కి౦టె
కాలి గిట్టల నడుమ
సూడనీ ఓసారి

నా మావ అడుగిడిన
నలిగేటి మట్టినీ
కనిపెట్టగలనమ్మ
కరుణతో సూపమ్మ

పగవాడె  లేనట్టి
మగవాడు నాసామి
పనికైతె  ముందు౦డె
పనిజీవి నాసామి

మాపిటేలకు ముందే
మరిలొచ్చు నాసామి
మసక సీకటి అయిన
మరలి రాడాయె

ఆకాశ మార్గాన
ఎగిరేటి రాయంచ
సూపెట్టు నా తల్లి
నా గిరిని సూపెట్టు

అడుగుముందడుగేస్తు
అడుగులే లెక్కిస్తు
ఆదమరసీ నేను
ఆటలో మునిగు౦టె

అడుగులో అడుగేస్తు
నడుమునే తడిమేస్తు
రాజల్లె సెయ్యెత్తి
రాయంచ వంటాడు

ఆదమరిసీ నేను
నిదురించు ఏలలో
సడి సెయ్యకే ముద్దు
కురిపించు నాసామి

ఎక్కడున్నాడో ఆడు
ఏ సిక్కుల్లో సిక్కాడో
ఎగిరి నే ఎల్లాలి
ఎట్టాగొ సూపమ్మ

గల గలా పారేటి
గంగమ్మ తల్లీ
అడవికంతా నీవు
అన్నమిస్తు౦టావు

కొండపై ఎగురుతూ
కోనలో జారుతూ
అడవిన౦తా నీవు
పలకరి౦చొస్తావు

అడవి కెళ్ళిన మావ
దారి మరిచాడేమొ
ఆ దారి నువ్వెలితె
దారి సూపుము తల్లి 

నా కంటి కన్నీరు
నీ వెంట పంపేను
ఆడు సూసాడ౦టె 
నీ వెంట వచ్చెను 

కొండల్ని అడిగాను
కోనల్ని అడిగాను
మబ్బుల్ని అడిగాను
దుబ్బల్ని అడిగాను

అమ్మకే అమ్మయిన
ఓ అడవి తల్లీ
కరుణించి ఓ మారు
కదలి రావమ్మా

అడవినే నమ్మిన
జీవాల కంతా
అమ్మవే నీవైతె
నా అమ్మవై రావా

ఒడిలోన సిరసెట్టి
బోరుమని ఏడ్వాలి
నా కన్నీరు మబ్బులై 
నిన్ను తడపాలమ్మ 

బలమైన ఓ సామి 
బాధ్రాద్రి రామయ్య  
సూరీడి కులములో
సిరసెత్తి  నావంట

అయ్య మాటను నమ్మి
అడవికే ఎళ్ళావు
ఆరుబయటైనా నువు
రాజులా ఎలిగావు

రాయికే పానాలు
తాకి ఇచ్చిన సామి
సీతకై వనమంత
తిరిగి వచ్చిన సామి

సతి లేక నీవెంత
మతి లేక తిరిగావో
సెట్టు పుట్టల కెరుక
నార బట్టల కెరుక

సీత జాడను జూప
కోతులే నీకు౦డె 
మావ జాడను సూపు 
జాడలే కరువాయె

ముందు ఎవరూ లేరు
ఎనక గుమ్మం తప్ప
మనసున్న ఓ సామి
మర్మమేదో సెప్పు

మతిలేక వాగేటి
నా మాటలనుకోక
మావ తోడును సూపు
తోవ ఏదో  సూపు

పొద్దు మూకేకళ్ల
పెద్ద సేరువే సీల్చి
సిన్న సీకటి సీల్చ
నీకేటి భయము

సీతమ్మ నీవయిన
సామి జెవిలో సెప్పు
రాస కార్యములోన
సామి మరిసుంటె  

సుక్కకే సుక్కయిన
ఎలుగు సుక్కవు నీవు
మొగ్గలో పుట్టేవు
సిగ్గు రాముడి కిచ్చేవు

కోటనే ఇడిసేవు
కొనకే ఎల్లేవు
సామి దగ్గర వుంటె
సరుగమే అన్నావు 

అందాల నా సామి 
అడవి కెలతావు౦టె 
అనుకోక తెమ్మంటి 
అడవి సిలకొకటి

సిలక ఎందుకె నీకు 
సిలకకే సిలకవని 
మావ పలుకగ నేను 
అలుకనే సూపాను

సిన్నబోయిన నాకు
సిన్ని ముద్దులు ఇచ్చి
సిలకొక్కటే కాదు
సిరిగంధమే తెస్త

సిగ్గుతో మొగ్గయిన
నా బుగ్గ సిదిమి
సిటికెలో వస్తాను
సిగ ముడవమని సెప్పె

సిటికె సెప్పిన సామి
కటిక సీకటి అయిన
కళ్ళకే కనరాడు
ఒళ్ళంత కళ్ళయిన 

తప్పు సేసితి నేను 
సె౦పనే ఆయి౦చు 
తెలిసినా నీ కతను 
తిరిగి నే జేశాను 

బంగారు జి౦కకై 
పరుగులెత్తిన సామి 
క౦గారుగా తిరిగి 
కడకు నిను గోల్పోయె

కోరరానీ కోర్కె 
కోరిన౦దుకు నీవు  
కోరి వలచిన వాడు
కడు దూరమై తిరిగె

కతలు కతలే గాని
గవి జరగవనుకున్న
కతలు నిజమైనాయి
కడకు వెతలైనాయి

కష్టాల కడలిలో 
కడదాక ఈదావు
కరుణ సూపుము నాపై
దారి సూపుము ఆపై

కోతులా ఓ సామి
సేవగల నా సామి
చేవగల ఓ సామి
సేయగలిగిన సామి

సీతమ్మ నడిగితే
సిరునవ్వె నవ్వింది 
ఏలెట్టి సూపి౦ది  
నీ మొక్కె దిక్కని

అన్ని దిక్కుల కెగిరె
గాలి  కూనపు నీవు
గాలింపవా సామి
లాలింప నా మనసు

సెట్టు లెక్కిన సామి
పుట్ట తొక్కిన సామి
సెట్టునే ఎక్కవా
నా సామి జూడవా

మగువ మెచ్చిన సామి
మురళి  పట్టిన సామి
మురళినే ఊదవా 
నా సామి బిలువవా

గిరిని ఎత్తిన సామి 
ధరణి మింగిన సామి 
నోరు తెరచీ చూపు
అగుపి౦చునో నా సామి 

సీరలిచ్చిన సామి 
సారె బెట్టిన సామి
ఆరు బయటున్నాను
దారి సూపవు ఏమి

రథము నడిపిన సామి
గీత పలికిన సామి
పతిని సూపగ లేవ
గతిని మార్చగ  రావ

మంచు కొండల సామి
మనసు సల్లని సామి
నీ కులము దానగా
వ్యాకులము తీర్చవా

ఎరుక తెలిసిన సామి
ఎరుక అయినా సామి
ఎరుక సెప్పవు మగని
కినుక ఎందుకు నీకు

గుడిసెలో ఎలిగేటి
గుడ్డి దీపము సాచ్చి
కుళ్ళి కుళ్ళి నేను
కన్నీళ్ళు  కార్చాను

కరుణ లేనీ సామి
కరుగక వున్నాడు
కరుణించు నా సామి
తిరిగి రాకున్నాడు 

పక్క ఏసితి గాని 
ఆ పక్క కెలలేదు 
దిక్కు తెలియక నేను 
బిక్కుమని ఉన్నాను 

పిట్టలే అరిచాయి
పగలొచ్చె  నేమో? 
ఉలికిపడె  నా మనసు  
సిలికె కన్నుల నీరు

  *****


వనములో  సీతల్లె 
వగసేటి ఓ తల్లి
సిలక వచ్చెను  సూడు
ఎతలు  పోవును నేడు

ఉలికి పడకే తల్లి  
ఒయ్యారి సిరిమల్లి  
ఓంపులే దాచుకో
వచ్చేను నీవాడు

సిలక జోస్యము  కాదు 
పలుకు ఆస్యము కాదు  
కల కానె కాదులే
ఇలలోని నిజములే

శివ సామి లేనట్టి
శివుడి గుడిలో నేను
గూడు కట్టుక వున్న
తోడు లేకనె వున్న

పాన మట్టము పైన
పవళించి వుంటె
శివ సామి అనుకొని
సిర సెత్తి సూసా 

కలిసాడు నీ నరుడు 
పలికాడు ఆ గిరుడు 
గుబులెందుకే నీకు 
పగడాల మొలక 

కన్ను మూయక వాడు 
వగచాడు నీ తోడు
కడుపు నిండెను నాకు 
కలత లుండవు నీకు   

కల్ల లెరుగని మనసు
ఎల్ల లెరుగని ప్రేమ
కలబోసి నీకిచ్చె 
కన్నీరు తుడుచుకో

ఎర్రబారిన ఆ కళ్ళు
ఎదుట బడ్డాయ౦టె  
ఎదలోన వానికి
ఎనలేని బాధేను

సెప్పి వచ్చానులే
తన రాక నీకెరుక
సెప్పి వస్తాననీ
నీ మనసిప్పి వస్తాననీ

కోరినావంటగా
కోరికేదో ఒకటి
కోరికే తీర్చ౦గ
ఎగిరి వచ్చితి నేను

మావ ఎరుకతొ నీ కళ్ళు
మణులై ఎలిగేను
ఆ ఎలుగు నే చూడ
ఎంత భాగ్యము నాకు

అదిగొ వచ్చెను చూడు
అందాల నీ వాడు
పరుగెత్త బోకమ్మ
అడుగు తడబడు నేమో!

( తన సంతోషాన్ని, దు:ఖాన్ని నా నోట పలికించిన గిరికకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు )

2 comments:

  1. ఎన్ని సార్లు చదివానో గుర్తులేదు
    చదివిన ప్రతీ సారీ ఎదో తెలియని తన్మయత్వం, ఉద్వేగం కలుగుతున్నాయి.

    అభినందనలు

    ReplyDelete
  2. wow saana bagunnadi.adi kevalam oka girika manase kaakapovvachu may be aalasyamaina thana maava raka kosam yeduru chuse prathi baama hrudayam elage untundanukunta. really excellent.

    ReplyDelete