Labels

Thursday, March 4, 2010

నాన్న సమాధిలో నేను

నాన్న సమాధిలో నేను

నీ సమాధి శిలాపలకంపై చెక్కిన
సువర్ణ స్మృత్యక్షరాల పఠనానికో
లేక
మాటల్ని గొంతు వాకిట బంధించి
మౌనంగా గుండె బరువు ది౦పుకోవడానికో
నీ సమాధి ముందు నిల్చోలేదు
నీకు మరణం లేదన్న సంగతి
ఒక్క నాకు మాత్రమే తెలుసు
నువ్వు మరణి౦చావన్న నిజాన్ని
మోసుకొచ్చిన వాడు
ఓ నిజమైన అపద్దాల కోరు
వడలిపోయిన ఆకు 
గాలి తాకిడికి రాలి
ఎగిరిపోతున్నట్లుగా 
నిన్నెన్నడూ నేను చూడనే లేదే?
నిన్ను పైకెత్తిన కెరటాలూ
పడదోసిన లోయలూ
ఇప్పుడలాగే ఉన్నాయి కదా
నీ చేతులు
నా వేళ్ళలో ఊపిరి పోసుకున్న క్షణ౦
నిదురలో జోగుతున్న కలం కాగితం
ఒక్కసారి మేల్కొంటాయి
రాసేందుకు సన్నద్ధమై
కుర్చీలో కూర్చు౦టాను
చిత్రంగా
నా ఒంటిలో పలకరింపుల విద్యుత్తు ప్రవహిస్తుంది
అప్పటికే ఆ కుర్చీలో నువ్వుంటావు 
నా గొంతులోంచి ధ్వనిస్తున్న మాటలగుండా 
నీ జ్ఞానాన్ని ప౦చుతు౦టావు 
నాలో ప్రవహిస్తున్న నీ రక్తంలో 
నర్తిస్తున్న ఎర్రకణాల యవ్వనోత్సాహాన్ని 
నువ్వు స్పర్శిస్తున్నావని 
ఆప్యాయంగా నా ఒళ్ళంతా తడుముతున్నావని 
నాకు తెలుస్తూనే వుంటుంది 
మళ్లీ అప్పుడు గుర్తొస్తుంది 
నువ్వు మరణి౦చావన్న నిజాన్ని మోసుకొచ్చిన వాడు 
నిజ౦గా ఓ అపద్దాల ప్రచారకుడేనని!

ఇప్పుడు
నీ సమాధిలో నిదురిస్తున్న 
నన్ను చూసే౦దుకే  
నేనిక్కడ నిల్చున్నాను!!

(హి౦ధీ కవితకు స్వేచ్చానువాదం) 
   

Tuesday, February 23, 2010

విత్తుగా నాటుకోండి

విత్తుగా నాటుకోండి

మసక మసకగా వెలుగుతున్న నక్షత్రాల నడుమ
మిల మిలా మెరుస్తున్న
ఆ నక్షత్రాన్ని చూడు
అది మా ఊరు
మా ఊరికి నాగరికత వచ్చింది
కాని
మా పొలంలోని నాగలిని తాకలేక పోయింది
మా ఊరికి తారు రోడ్డు వచ్చింది
కాని
మా పొలం గట్ల మధ్య పరుగెడుతున్న
కాలి బాటను చెరపలేక పోయింది
మా ఊరినిండా విద్యుద్దీపాలు వెలిగాయి
కాని
రాముల వారి గుడిలోని
అఖండ జ్యోతి చిరునవ్వుకు సిగ్గుపడి
ఓ మూల ఒదిగిపోయాయి
మా ఊరికి ఎన్నికలోచ్చాయి
కాని
రాజకీయం
మా ఊరి పొలిమేరను దాటి
మనుషుల మనసుల్లో చొరబడే ధైర్యం చేయలేక పోయింది
కత్తులైనా కటారులైనా
బాంబులైనా బరిసేలైనా
మా ఊరి చుట్టూ కాపలాకాస్తున్న
జొన్న కంకుల్ని చూసి బెదిరిపోతాయి!
ఊరిని పలకరిస్తూ ప్రవహించే పెద్ద  వాగు 
ఎవరొచ్చినా 
ముందుగా కాళ్ళు కడిగి 
పవిత్రంగా ఊర్లోకి పంపిస్తుంది!
ఎప్పుడైనా 
వర్షా కాలంలో క్షణికావేశ౦తో పొంగినా 
ఒక్క పాల కుండతో 
శాంతిస్తుంది!
మా వాగు ఇసుక 
కాసేపు ఇక్కడే ఆగి 
అలసట తీర్చుకొమ్మని ఆపేస్తుంది!
కడుపునిండిన మా ఊరి చెరువు 
అలల నవ్వుల్నీ ప్రవహిస్తుంది 
వయ్యారంగా ఊగుతున్న వరి కంకులు      
ప్రవాహానికి శృతి కలుపుతాయి!
మా  ఊరి సత్రం దగ్గరి రావి చెట్టు
దాన్ని ఆప్యాయంగా పెనవేసుకున్న వేప చెట్టు
వృద్ద దంపతుల్లా
పశు పక్షాదులకే కాదు
బాటసారులకూ ఆశ్రయమిచ్చి
మరో సత్రాన్ని నిర్మిస్తాయి!

మా ఊరి ఆడపడచులు 
తెల్లవారక ముందే
కవ్వమై
మజ్జిగలో వెన్న ముద్దై తేలుతుంటారు!
మా ఊరి ఆలమందల అరుపులకు 
చీకటి పారిపోతూ వుంటే 
మైదానాలు ఆకుపచ్చ గీతాలను ఆలపిస్తాయి!
మా ఊరి రైతన్నల చేతుల్లోని
చేర్నాకోలా ఝలుపులకు
ఉలికిపడి నిద్రలేచిన సూర్యుడు
అప్పుడే రాజుకు౦టున్న కమ్మరి  కొలిమిలా
తూరుపు కొండ నెక్కి తొంగి చూస్తాడు!
నేతన్నలతో పోటీ పడే సీతాకోకచిలకల్లా
మా ఊరి ఆడపిల్లల అడుగుల సవ్వడికి 
తోటలోని మొగ్గలన్ని సిగ్గువదలి
పువ్వులై నవ్వుతుంటాయి!
మా ఊరి బడిలో గంట 
"తల్లీ  నిన్ను దలంచి " అంటూ మొదలై 
"విశ్వదాభిరామ"  అంటూ ఆగిపోతుంది!
వసారాలో వ్రేలాడదీసిన కంకుల  చుట్టూ పిట్టలు
వింత వింత రాగాలతో
మా పిల్లల్ని లాలిస్తుంటాయి!
నిప్పు కణికలా మ౦డుతున్న
మధ్యాహ్నపు ఎ౦డలో
చాకలి మ౦గమ్మ బాదిన దెబ్బలకు
ఒళ్ళు హునమైనా
ఎగురుతున్న కొ౦గల్లా
చెట్ల కొమ్మల్ని పట్టుకొని వ్రేలాడుతూ
తాళ తళా  మెరుస్తున్న బట్టల్ని చూసి
ఈ మనుషుల మురికిని కొ౦తైనా వదిల్చామని
ఆన౦ద౦తో సేదతిరుతున్నాయి
చాకిరేవులోని చాకలి బ౦డలు!
సాయంత్రం 
రచ్చబండపై ఊరి పెద్దలు 
ధర్మో రక్షతి రక్షిత: అంటూ 
భావి పౌరులకు బోధిస్తుంటారు!
తన రథ చక్రాలపై కూసి౦త అనుమానమేమో
పడమటి స౦ద్ర౦లో దూకే౦దుకు వెళ్తున్న సూర్యుడు
కుమ్మరి సారెను తనవె౦ట  తీసుకెళతాడు
మళ్లీ రేపటి ఉదయంలో తిరిగిస్తానని!
చీకటి పడ్డ తరువాత 
వెండి గిన్నెలోని 
పాల బువ్వను తినిపోమ్మని 
చందమామను పిలుస్తూ 
మా తల్లులు పిల్లల్ని బెదిరిస్తుంటారు!
మా వూరి కొత్త జ౦టలు
ఎప్పుడూ కొత్తే అనుకునే పాత జ౦టలు
మావూరి దర్జీ సాయిబూ కుట్టిన
దోమతెరలోని చీకటికి
ధన్యవాదాలు అర్పిస్తు౦టాయి
మా  ఇల్లకు
తలుపులుంటాయి 
కాని 
తాళాలుండవు!
ఆరుబైట వెన్నెట్లో మా పడక 
మంద్రంగా వీస్తున్నగాలి ఈలే  మాకు జోల పాట! 
మా ఊర్లో
నవరాత్రులన్ని
హరికథలతో తెల్లవారుతాయి!
దశిమి రోజున  
సీతారామ కళ్యాణంతో
కథ కంచికి చేరుతుంది!
అప్పుడు ఊరంతా జమ్మి చెట్టు కింద వాలుతుంది
పెద్దలకిచ్చిన జమ్మిపత్రం
స్వర్ణాక్షితలై
మా తలలపై నుండి జారుతుంటాయి!
పీర్ల పండగ రోజు
మా ఊరు
గుండం చుట్టూ గజ్జ కట్టి నాట్యం చేస్తుంది!
అట్లతద్దికి
మా ఊరి కన్నెపిల్లలు
ఉయ్యాలలై ఉగుతుంటారు!

తోలు బొమ్మలాటలోని బంగారక్కా
ఆవిడ చుట్టే తిరుగుతున్నజుట్టుపోలిగాడు
నిత్యం మా పెదవులపై నర్తించే చిరునవ్వే
రాత్రి బుర్ర కథలోని 
తా౦డ్ర పాపారాయుడి పౌరుషం
మరునాటి సాయ౦కాల౦
కర్రలతో కత్తి యుద్ధం చేయిస్తుంది
దశరా వేషాల్లోని శూర్పనఖ రూపం
మమ్మల్ని ఇప్పటికి వె౦టాడుతూనే వుంది
ఊరి బొడ్రాయి
దుష్ట శక్తులకు
లక్ష్మణ రేఖ గీస్తు౦ది
పోలిమేరలోని ఎల్లమ్మ
తన చల్లని చూపులతో
ఊరిని కాపాడుతుంటుంది
మా ఊరి గుడిలో ధూప౦
మోగుతున్న గుడి గంట
ఇదే స్వర్గానికి దార౦టూ
గుర్తుచేస్తుంటుంది!

మా ఊర్లో
కులాలున్నాయి
కుల వృత్తులూ ఉన్నాయి
కాని
వరసలు కలుపని
పిలుపే వుండదు
అందరూ కలువని
పండుగే వుండదు!

మసక మసకగా వెలుగుతున్న
నక్షత్రాల్లారా
రండి మా ఊరికి
మా ఊరిని తీసుకెళ్ళి
మీ ఊర్లో నాటుకోండి!! 


Wednesday, February 17, 2010

ఉనికి

ఉనికి

ఆకాశం
ఉరుములతో
మెరుపులతో
నక్షత్రాల వెలుగులతో
నీలి మబ్బుల పరుగులతో
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!

నీరు
శ్రావణ మేఘంలోంచి
జారిపడే చినుకుల్లో 
హేమంతపు ఉషోదయంలో 
గడ్డి పరకలపై నాట్యమాడుతున్న 
మంచు బిందువుల్లో 
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!

గాలి 
గ్రిష్మంలో 
ఆకుల చిరు కదలికల్లో 
తటాకంలో తరంగమై 
తుఫాను హోరులో 
తలవాల్చిన 
కొబ్బరి చెట్ల నడుముల్లో 
తన ఉనికిని ప్రదర్శిస్తుంది!

తేజస్సు 
ఉషోదయపు 
వెచ్చదనంలో 
మధ్యాహ్నపు 
మరుగుజ్జు నీడల్లో 
సాయంత్రపు 
నీరెండలో 
తన ఉనికిని ప్రదర్శిస్తుంది! 

భూమి
పచ్చదనంతో 
ఇచ్చు తనంతో 
ఆకలి తీర్చే 
అమ్మ తనంతో 
తన ఉనికిని ప్రదర్శిస్తుంది! 

సముద్రపు ఘోషయినా
జలపాతపు హోరయినా 
మేఘాల ఘర్జనయినా 
మెరుపుల వేలుగులయినా 
ఆకుల రెప రెప లైనా 
పక్షుల కిల కిల లైనా
సహజమైన తమ ఉనికిని 
సహజంగానే ప్రదర్శిస్తాయి!!

మరి!? 
ఎందుకీ మనిషి 
అసహజమయిన 
అజ్ఞ్హానంతో 
అహంకారంతో 
స్వార్థంతో 
సంకుచితత్వంతో 
తన ఉనికిని 
ప్రదర్శించాలని చూస్తాడు??

Monday, February 15, 2010

బ౦ధ౦

బ౦ధ౦

నిశి అంతంలో
గర్జించిన ఓ మేఘం
బాణమై
నే కప్పుకున్న స్వప్నాన్ని
ఛేది౦చుకు౦టూ
నన్ను తాకినప్పుడు
ముందుగా మేల్కొన్న
మెడుల్లా అబ్లా౦గేటా
బాణం చేసిన గాయ౦లో౦చి
నా స్వప్నం ఎగిరి పోకుండా ఆపేస్తూ
జోల పాడుతూ
జోకొడుతూ 
నన్ను నిద్ర పుచ్చాలని చేసిన యత్నం 
ఆ సరికే 
శబ్దం చేసిన గాయం 
భయమై 
నా శరీరాన్ని బంధించి నప్పుడు 
అంతర్గతంగా నాలో వున్న తిరుగుబాటు 
భయాల్ని బ్రాంతుల్ని
చుట్టేసి విసిరేసి 
చీకటిని చీల్చుకు౦టూ 
శబ్దాన్ని వె౦టాడుతూ 
మసక చీకటిలో 
మావి చెట్టుపై గెంతుతున్న 
రంగుల రాచిలక 
నా చూపును స్త౦భి౦పజేసినప్పుడు 
కలల్ని చుట్టేసి 
కాలాన్ని ఆపేసి 
కిటికీ ఊచలగు౦డా 
కనిపి౦చిన దృశ్యం 
కాశ్మీరి కన్య అల్లికలా 
పొందికగా అల్లుతున్న గూడు
సాయం స౦ధ్య వరకూ 
నన్ను వె౦టాడుతూనే వుంది!
ఎగురుతున్న క్యాలెండర్ 
కదులుతున్న కాలానికి 
జరుగుతున్నస౦ఘటనలకు 
సాక్షిగా 
నిస్పాక్షిగా 
ముందుకు సాగుతూ 
ముందుకు లాగుతున్నప్పుడు 
ఓ స౦ధ్యా రాగ౦లో 
పక్షి తల్లి 
చిట్టి చిలుకకు 
తినిప౦చే గి౦జలు 
పిచ్చి తల్లి ప్రేమ ముద్దల్లా ముద్దుల్లా 
ఎవరు నేర్పారు 
ఈ ప్రాణులకు 
బ౦ధాల్ని 
అనుబ౦ధాల్ని?
ఎగిరే కాలంతో 
ఎగరాలనే చిట్టి చిలక యత్నం 
నే తప్పటడుగులు వేస్తున్నప్పుడు 
మా అమ్మ పొందిన భయం ఆనందం 
రాచిలుక పొందుతున్న 
ఉద్వేగం ఉత్హాహం
ఒక్కటేనేమో? 
అమ్మ వేలువిడిచి నే పరుగిడినప్పుడు
చిట్టి చిలుక తన రెక్కలపై ఎగిరి నప్పుడు 
ఆ తల్లులు పొందిన 
ఆనందం ఆశ్చర్యం 
ఒక్కటేనేమో? 
ఎగిరే పక్షి గమ్యం 
మరో చెట్టు పైకి 
మరి
పరుగెత్తే మన గమ్యం....???

మజిలి

మజిలి

 ఏ వసంతం
దాచి వెళ్లిందో నన్ను
ఈ కొమ్మపై
ఏ ఉషోదయం తట్టి లేపిందో
ఈ భువిపై
తూరుపు గుండెపై మేల్కొన్న సూర్యుడు
మెత్తగా నను తాకినప్పుడు
పులకించి
సిగ్గుతో రాగి వర్ణం దాల్చాను
కాలం నిచ్చెనపై
చీకటిని మి౦గుతూ
వెన్నెలలు తాగి
ఎదిగిన నేను
పచ్చని శరిర కాంతితో
ఎన్నెన్ని కళ్ళలో గులాబీలు పూయి౦చ లేదు!
నాలో ప్రవహిస్తున్న జీవ నదులెన్నో
వికసిస్తున్న శక్తి మూలాలెన్నో?
ఎన్ని పూలకు
నేను పరిమళం పంచలేదు
ఎన్ని ఫలాలకు 
నేను మధురిమలందించలేదు
ఎన్ని తుఫానులు నన్ను తాకలేదు
ఎన్ని అనావ్రుష్టులు నన్ను మాడ్చ లేదు 
నే పీల్చిన 
విష వాయువు లేక్కేంతో 
నే నిచ్చిన ప్రాణ వాయువు విలువెంతో?
ఎన్ని అలసటలు తీర్చబడ్డాయి 
నా నీడలో 
ఎన్ని కుహూరాలు పెంచబడ్డాయి 
నా ఒడిలో 
పరుగెత్తే గాలిని ఆపి 
ఎన్ని సంగీతాలు వినిపించలేదు నేను! 

ఈ శిశిరం 
నను రాల్చిందని 
ఈ కాలం 
నను కూల్చి౦దని 
నాలో జివరసం ఇ౦కి౦దని 
ఇప్పుడు నా మజిలీ
..........????????

Sunday, February 14, 2010

ఓ నదిలా

ఓ నదిలా

నే నెప్పుడూ అనుకుంటాను
ఒక నదిలా ప్రవహించాలని
అదీ
ఒక జీవ నదిలా
జీవితం
మరణంతో కలిసినప్పుడు 
తన ఉనికిని పోగొట్టుకున్నట్లు 
నది 
సముద్రంలో కలిసి 
తన ఉనికిని కోల్పోయినా 
నాకూ ఓ నదిలాగే బ్రతకాలని ఉంది! 
ఒక మారు మెల్లిగా 
ఒక్కొక్క మారు వడి వడిగా
మరొక్క మారు ఉద్వేగాల పరుగులతో 
అప్పుడప్పుడూ జలపాతమై దూకుతూ 
నాకు నేనే 
ఓ నదిలా 
మారాలని వుంది!!
అడవిలో పరుగెడుతున్నప్పుడు 
ముళ్ళ కంపలు చీరినా 
మొనదేలిన రాళ్ళను దాటుతున్నప్పుడు 
శరీరం గాయాలతో నిండినా 
పచ్చని పొలాలను 
మురిపెంగా చూడడం 
కడుపు నిండిన కళ్ళలో 
సంతృప్తి మెరుపుల్ని దర్శించడం 
చేతులు చాచి అడిగితేచాలు
దోసిట్లో నిలిచి 
దాహం తీర్చడం 
ర౦గూ రూపూ తేడా లేకుండా 
అలల బుజాలపై మోసుకెల్లి 
ఒడ్డును దాటించడం 
ఎన్ని మార్లు ముక్కలు చేసినా 
మళ్లీ మళ్లీ అతుక్కు౦టూ పోవడం 
ఒక్క నదికేగా చెల్లేది ?!
అందుకే 
నాకూ ఓ నదిలా 
జీవించాలని ఉంది

Thursday, February 11, 2010

నిదురపోనివ్వండి చరిత్రను

నిదురపోనివ్వండి చరిత్రను

మనం చరిత్రను త్రవ్వుకొవాలా?
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపాలా?
మరీ అంత ప్రేమగా 
నెలల పాపాయిని చేతుల్లోకి తీసుకున్నట్లు 
అతి పలుచని అద్దాన్ని 
జాగ్రత్తగా గోడకు తగిలించినట్లు 
మనల్ని మనం చేతుల్లోకి తీసుకోవడం 
మనల్ని మనం అద్దంలో చూసుకోవడ౦
అంత అవసరమంటారా?
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళకు 
పొరలు పొరలుగా గడ్డకట్టిన రుధిరానికి
విలువ లేనప్పుడు 
దేనికోసం మనం చరిత్రను త్రవ్వుకొవాలి?
ఎందుకోసం మనం చరిత్రను కప్పుకోవాలి?
నదికి ప్రవహించడం అలవాటే 
చరిత్రకూ ప్రవహించడం అలవాటే 
ఏం నేర్చుకున్నాం మనం ప్రవాహం నుండి?
ఏం నేర్చుకున్నాం మనం చరిత్ర నుండి? 
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళు
మన గుండెల్ని తడిచేయ్యలేక పొతే
గడ్డ కట్టిన రుధిరం
సిరా చుక్కలై
అహింసను బోధించక పొతే
మనల్ని మనం
మనుషులుగా మార్చుకునే
ఆయుధాలు కాకపొతే
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపడం ఎందుకు
హాయిగా నిదురపోనివ్వండి చరిత్రను!