Labels

Wednesday, June 23, 2010

నేను

నేను

నేను


ఉదృత తుఫానులో చిక్కుకొని దారి తప్పి తిరుగాడుతున్న
ఓ కన్నీటి చుక్కను


సువిశాల సముద్రంలో ఉనికిని కోల్పోయి ఈదులాడుతున్న
ఓ వర్షపు చుక్కను


విస్తరించిన ఎడారిలో నోరెళ్ళబెట్టి ఓ మేఘ శకల౦ కోస౦ ఎదురుచూస్తూ వేడెక్కుతున్న ఓ ఇసుక రేణువును


అలలు అలలుగా ప్రవహిస్తూ అలుపెరుగక పరుగెడుతున్న గాలికి
అర్పిస్తున్న ప్రాణ వాయువును


తన చల్లని ఒడిలో బంధించి లాలిస్తూ కాపాడుతున్న ఒడ్డుకు
సమర్పిస్తున్న పయోనిధి ముద్దును!


నేను


జీవన పరిమళాన్ని అద్దే౦దుకు కాసిన్ని పుటల్ని దాచుకున్న
తెల్లకాగితాల పుస్తకాన్ని


బాధిత నయనాల జాలువారుతున్న కన్నీటిని తుడిచే౦దుకు
చాచిన చిటికెన వ్రేలును


చినుకు కలాలతో హరిత కావ్యాలు లిఖిస్తున్న ధరిత్రిపై నడయాడుతున్న
అనుభూతుల ఘనీభవ దృశ్యాన్ని


గౌతముని దోసిట్లో౦చి గగనానికి ఎగిరిన
స్వేచ్చా పావురాన్ని!


నేను


ఓ నమ్మకాన్ని
ఓ కమ్మని కలని
అవని అంతా అల్లుకున్న అమ్మతనాన్ని!


నేను
ఈ విశాల విశ్వంలో నిరంతరంగా పరిభ్రమిస్తున్న ప్రాణస్ప౦దనను!! 


(బ్లాగులో పద్మార్పిత గారి ప్రొఫైల్ చూసి స్ప౦ది౦చి రాసిన వాక్యాలు)

2 comments:

  1. చాలా చాలా బాగుందండి.......ధన్యవాదాలు!

    ReplyDelete