Labels

Thursday, February 11, 2010

నిదురపోనివ్వండి చరిత్రను

నిదురపోనివ్వండి చరిత్రను

మనం చరిత్రను త్రవ్వుకొవాలా?
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపాలా?
మరీ అంత ప్రేమగా 
నెలల పాపాయిని చేతుల్లోకి తీసుకున్నట్లు 
అతి పలుచని అద్దాన్ని 
జాగ్రత్తగా గోడకు తగిలించినట్లు 
మనల్ని మనం చేతుల్లోకి తీసుకోవడం 
మనల్ని మనం అద్దంలో చూసుకోవడ౦
అంత అవసరమంటారా?
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళకు 
పొరలు పొరలుగా గడ్డకట్టిన రుధిరానికి
విలువ లేనప్పుడు 
దేనికోసం మనం చరిత్రను త్రవ్వుకొవాలి?
ఎందుకోసం మనం చరిత్రను కప్పుకోవాలి?
నదికి ప్రవహించడం అలవాటే 
చరిత్రకూ ప్రవహించడం అలవాటే 
ఏం నేర్చుకున్నాం మనం ప్రవాహం నుండి?
ఏం నేర్చుకున్నాం మనం చరిత్ర నుండి? 
చరిత్రలో ప్రవహించిన కన్నీళ్ళు
మన గుండెల్ని తడిచేయ్యలేక పొతే
గడ్డ కట్టిన రుధిరం
సిరా చుక్కలై
అహింసను బోధించక పొతే
మనల్ని మనం
మనుషులుగా మార్చుకునే
ఆయుధాలు కాకపొతే
ఎక్కడో మట్టి పొరల అట్టడుగున
యోగనిద్రలో వున్న చరిత్రను
తట్టి లేపడం ఎందుకు
హాయిగా నిదురపోనివ్వండి చరిత్రను!

Wednesday, February 10, 2010

కొంచెం ఆచూకీ చెప్పవూ?

కొంచెం ఆచూకీ చెప్పవూ?

విస్తరించిన ఎడారి ఇసుక రేణువులకు 
హరిత స్వప్నాలు పూయించి
ఏ ఖర్జూర వృక్ష క్షాయల క్రింద 
సేద తిరుతున్నావో ?

ఉదృత తుఫానులను పిడికిట బంధించి 
ధరిత్రిపై కల్లాపి జల్లి 
ఏ మట్టి పరిమళాన్ని పీలుస్తూ 
పారవశ్యంలో మునిగిపోయావో?

అడవి అంతా తిరిగి 
పూవుపూవునూ పలకరించి 
పూల కీలాగ్రాల తేలియాడుతున్న పుప్పోడులను మేల్కొలిపి 
ఏ పూరేకు చాటున నిదురోతున్నావో?

మేఘాలతో స్నేహించి
సెలయేళ్ళతో చెలిమిచేసి
జలపాతాలతో జతకట్టి
ఏ సముద్రపు నీలి తెరలక్రింద యోగనిద్రలో మునిగావో?

ఇక్కడ
ఈ జనారణ్యంలో 
ఒయాసిస్సునై 
పత్ర హరితాన్నై 
పుప్పోడినై
నీటి బింధువునై
ఎదురుచూస్తున్నా !!

నాకు తెలుసు

నాకు తెలుసు

నాకు
ప్రవహించడమే కాదు
పలకరించడము తెలుసు
మల్లె తోటపై పరుగెడుతున్న పిల్ల తెమ్మెరలా
పంట చేలపై తేలియాడుతున్న జానపదంలా
హృదయాన్ని తాకడము తెలుసు
నిదురిస్తున్న ఉదయాన్ని
కళ్లాపిలా తట్టి లేపడము తెలుసు

నాకు
పలకరించడమే కాదు
ప్రవహి౦చడమూ తెలుసు
బింధువులా మొదలై
సెలయేరులా సాగి
జలపాతంలా దూకి
సముద్రంలా ఉప్పొ౦గడమూ తెలుసు
మనసు పొరల్లోకి దూరి
మమతల తిగల్నిమీటి
పున్నమి వెన్నెలలా ప్రవహి౦చడమూ తెలుసు

నాకు
అందరినీ పలకరి౦చడమూ తెలుసు
అందరిలోకి ప్రవహి౦చడమూ తెలుసు
ఎండిన చెరువులోకి ఊటలా ఉబకడమూ తెలుసు
వడలిన ఆకులోకి
జివరసంలా ప్రాకడమూ తెలుసు
నాకు
ప్రవహి౦చడమూ, పలకరించడమే కాదు
ప౦చుకోవడమూ తెలుసు

Tuesday, February 9, 2010

భ్రమణం

భ్రమణం

మట్టిలోకి
ఓ నక్షత్రాన్ని విసిరితే
లక్ష హరిత నక్షత్రాలై
నీ ముందు మోకరిల్లుతాయి!

ఓ గుప్పెడు నీళ్ళను
ఆకాశంలోకి చల్లితే
నీ కోసం ఆ నిలాకాసం
ఓ మంచి నీటి జలతారు సముద్రాన్ని
కానుకగా పంపిస్తుంది!!

దేహాన్ని చీలుస్తున్న ద్వేషాన్ని
నీ పెరటి మొక్కగా పెంచితే
అది మహా వృక్షమై 
నీ భవంతిలోకి 
పగుళ్ళను పిడుగులుగా వర్షిస్తుంది!!!

నీ అధరాలపై 
చిరునవ్వును 
నీ హృదయంపై  కాస్త ప్రేమను పూయిస్తే
ఈ ప్రపంచం 
నిను తన కౌగిట్లో కాపాడుతుంది 

ఇవ్వడమనే తపస్సులోనే 
వ్యక్తిత్వం తన రూపాన్ని సరిచేసుకుంటుంది 
ఇచ్చి పుచ్చుకునే తత్వంతోనే 
ఈ జగత్తు 
ఓ భ్రమణం పూర్తిచేస్తుంది!!  

నేను మాత్రమే

నేను మాత్రమే

నా మదిలో
కదలుతున్న భావాలను
అక్షరాలుగా పేర్చేఅవిశ్రాంత ఘడియల్లో
నా హృదయం ఎన్ని ముక్కలుగా కత్తరించబడిందో
నాకు మాత్రమే తెలుసు!

తెగి పడ్డ 
ఒక్కొక్క ముక్క 
స్రవించిన రక్తనాలాలన్నీ
ఒక్కొక్క రక్తపుటేరుగా
ఈ ధరాతలాన్ని
ఎన్ని మార్లు చుట్టి వచ్హాయో
నేను మాత్రమే చూశాను!!

అందుకే
మాత్రు గర్భంలో
చైతన్యం పొందిన బీజం
పరిపూర్ణ రూపాన్ని సంతరించుకొని
ధరిత్రిపైకి జారుతున్న వేల
అనంత సాగర ఘోష
ఓ క్షన౦ ఆగిపోయేలా 
అమ్మ అవుతున్న ఆమె 
' అమ్మా ' అని అరిచినప్పుడు 
జరించిన శబ్ద తరంగ దైర్ఘ్యాన్ని
ప్రశాంత మైదానాల పచ్చదన౦లా 
ఆనంద పారవశ్యంలో మునిగినప్పుడు 
సన్నగా విచ్చుకున్న అధరాలపై 
మెరిసే దరహాస లిపిని 
నేను మాత్రమే చదువగలను!!!

Monday, February 8, 2010

మనకు మనమే బానిసలం

మనకు మనమే బానిసలం

కొండ శిఖరం కొనపై జీవించడం
అంత సులభమేమీ కాదు
సముద్రం మీద పడవ ప్రయాణం
అనుకున్నంత ఆనందమేమి కాదు
అలల బెదిరింపు
తుఫానుల భీబత్సం
ఎప్పుడూ ని వెన్నంటి ఉంటూనే వుంటాయి
నీ నావను నువ్వే నడుపుతున్నప్పుడు
ఉన్నంత ధైర్యం, నిబ్బరం
మరెవరో నడుపుతున్నప్పుడు ఉండకపోవచ్చు
జీవితమూ అంతే
నీ జీవితాన్ని మరెవరో నిర్దేశిస్తున్నప్పుడు
చుక్కాని నీ మాట వినదు
అప్పుడు నీ చుట్టూ వున్న ప్రకృతి
ఉన్నంత అందంగా కనిపించక పోనూ వచ్చు!

ఇంతకూ నే చెప్పొచ్చేదేమిటంటే 
మనమందరమూ బానిసలమే 
నావకో 
చుక్కానికో
నడిపే వాడికో?
అప్పుడప్పుడు 
మనకు మనమే !?

నే నిక్కడకు వచ్చింది

నే నిక్కడకు వచ్చింది

నే నిక్కడకు వచ్చింది
మొనదేలిన ఈ అనాది ఇసుక రేణువులతో
నా పాదాలను గాయపరచుకునేందుకు కాదు
నా కాళ్ళను నాగళ్ళుగా చేసి
చిగురించడం మరచిపోయిన
ఈ గోధుమ వర్ణపు ఇసుక మేటలకు
మట్టి గంధపు కల్లాపి జల్లి
ధరణి కన్యకు ఆకుపచ్చ చీర బహుకరించేందుకు!

నే నిక్కడకు వచ్చింది
ఈ ఎడారిలో కునికిపాట్లు పడుతున్న
ఒయాసిస్సుల కంటి రెప్పల చాటున
నా దాహార్తిని దాచిపెట్టేందుకు కాదు  
వేలాది వేల ఇసుక పొరల క్రింద
తపస్సమాదిలో ధ్యానిస్తున్న
అనంత అంతర్వాహినీ తరంగాలను
నోరెండిన ఈ సైకత లోయలలో
నయనానందకర ప్రవాహ దృశ్యాలుగా చిత్రి౦చేందుకు
నేనిక్కడకు వచ్చింది
ఖర్జూర హరిత చత్రాల చాయలో
నా స్వేద ద్వారాలను తోసుకొని
ఉబికిన చెమ్మను ఆరబెట్టుకోవడానికో కాదు
ఈ నా అకుంటిత దీక్షా కండరాలలో పొదిగిన
శ్రమ శక్తిని పితికి
ఒయాసిస్సుల నడుమ
సుదూరంగా విస్తరించిన ఇసుక మైదానాలకు
ఫల పుష్ప స్వప్నాలను కానుకగా ఇచ్చేందుకు!

నేనిక్కడకు వచ్చింది
ఈ ఇసుక దిబ్బల గుడారాల నడుమ
నగ్న శిఖరాగ్ర సీమలపై
నా విగ్రహాలను చేక్కేందుకు కాదు
రేపటి తరం మరో తరానికి అందించబోయే
తీయటి జ్జాపకాల మరంద మాలలుగా
ఈ తరం పాదముద్రలను దాచిపెట్టేందుకు!

నేనిక్కడకు వచ్చింది 
జ్యాత్యాహంకారపు విషపు నాగుల
సాలె  గూటిలో చిక్కుకొని 
రహదారి పక్క విసిరేయబడ్డ ఓ అనాధ శవమై 
కన్నవారి చేతుల్లోంచి జారిపడే 
ఓ బూడిద మూటగా  మిగలాలని కాదు
ఇక్కడి మానవతా మొక్కలను 
ఇక్కడి స్నేహ సౌరభాలను మోసుకెళ్ళి
మా పొలాల్లో పండించుకునేందుకు!!